Festivals: ఒకే రోజు రెండు పండుగల వేడుక
కోటి కాంతులీనె..
ముక్కోటి దేవతలు ఒక్కటైన అపురూప పర్వదినం. నిరంజనుడైన భగవంతుడు ఉత్తరద్వారం గుండా అశేష భక్తజనావళిని అనుగ్రహించే శుభ ఘడియలివి. గోదాదేవి నిత్యం తన పాశురాలతో రంగనాథుడిని సేవించుకొనే ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి ఎన్నో పుణ్యఫలాల పేటి. మనలోపలి షట్చక్రాలలో సహస్రారంలోని శక్తి ఉత్తేజితమయ్యేందుకు ఈశ్వరుడి ఉత్తరద్వార దర్శనం శుభప్రదమైందని ప్రతీతి. భద్రాచలం, యాదాద్రి, వేములవాడ, ధర్మపురి, తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనాలు ప్రారంభమయ్యాయి. జగద్గురువు శ్రీకృష్ణభగవానుడు అర్జునుడికి జీవనసత్యాలను, పరమాత్మ తత్వాన్ని వివరిస్తూ భగవద్గీతను బోధించటం ప్రారంభించిందీ ఈ రోజే కావడం మరో విశేషం.
ఏసయ్య ఏతెంచె
విశ్వశాంతి దూత.. ప్రేమైకమూర్తి.. దేవుని కుమారుడు భూమిమీద అడుగుపెట్టిన శుభదినమిది. ప్రపంచానికి గరిమనాభి అయిన పవిత్ర క్షేత్రం జెరూసలెంలో మహా మానవ ప్రవక్త పాదం మోపిన రోజు ఇది. తన స్పర్శమాత్రంచేతనే మానవులలో పరివర్తన కలిగించిన ఏసుక్రీస్తు ఏతెంచిన పండుగ క్రిస్మస్.. విశ్వవ్యాప్తంగా అర్ధరాత్రినుంచే క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. ప్రఖ్యాత ప్రార్థనామందిరాలు.. క్రైస్తవుల ఇండ్లు, కూడళ్ల వద్ద క్రీస్తురాకకు ప్రతీకలుగా నక్షత్రకాంతులీనుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి విద్యుద్దీపాల వెలుగుల్లో విరాజిల్లుతున్నది.